ఫస్ట్ ఫిల్మ్‌లో చేసినప్పుడు ఓ బిడ్డ తల్లి.. రెండో సినిమాకు మరో బిడ్డతో బాలింత!
on Jun 19, 2021
షావుకారు జానకి.. తొలి చిత్రం 'షావుకారు'నే తన ఇంటిపేరుగా మార్చుకొని పాపులర్ అయిన గొప్ప నటి. తెలుగు చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే తారల్లో ఒకరు. అలాంటి ఆమె ఫస్ట్ ఫిల్మ్‌లో నటించే సమయానికే ఓ బిడ్డ తల్లి అనే విషయం మనలో చాలామందికి తెలీదు. అవును. జీవితం గురించీ, వైవాహిక వ్యవస్థ గురించీ సరైన అవగాహనలేని టీనేజ్‌లోనే పెళ్లయింది. పద్దెనిమిదేళ్లకే తల్లయ్యారు. పాప సంరక్షణ చూసుకుంటూ, కుటుంబ భారాన్ని ఆమే నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తప్పనిసరిగా ఆమె డబ్బు సంపాదించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడామెకు గ్లామర్ లేదు. పీలగా, పొట్టిగా ఉండేవారు. అలాంటి స్థితిలోనే ఆమెను 'షావుకారు' చిత్రంలో హీరోయిన్‌గా ఎంచుకొని ఆ రోజుల్లో సంచలనం సృష్టించారు విజయ ప్రొడక్షన్స్ అధినేతలు. నటరత్న ఎన్టీ రామారావు హీరోగా నటించిన ఆ సినిమా విజయం సాధించడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది.
జెమిని వారి 'ముగ్గురు కొడుకులు' జానకి రెండో చిత్రం. అప్పటికి ఒక్క సినిమాయే చేసినందువల్ల ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అప్పట్లోనే ఆమెకు రెండో సంతానంగా అబ్బాయి పుట్టాడు. బాలింతరాలుగా ఉండగా సరైన పౌష్టికాహారం లేక బలహీనంగా, నీరసంగా ఉండేవారు. అయినా బతుకుతెరువు నిమిత్తం సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మానలేదు. ఆ రోజుల్లో జెమినీ గణేశన్ జెమినీ సంస్థలో యాక్టర్లను ఎన్నికచేసే క్యాస్టింగ్ మేనేజర్‌గా ఉండేవారు. ఆయనను జానకి "అన్నా" అని పిలిచేవారు. జెమినీలో నటించడానికి జానకి అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు, జెమినీ గణేశన్ ఆమె ఫొటోలు తీసుకొని, తగిన సందర్భం వచ్చినప్పుడు తప్పక కబురుపెడతానన్నారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. నాగేంద్రరావు దర్శకత్వంలో జెమినీవారు 'ముగ్గురు కొడుకులు' సినిమా ప్రారంభిస్తుండగా, అందులోని కోడలి పాత్రలో జానకి సరిపోతారేమోనని చూడడానికి కబురు పంపించారు. జెమినీ అధినేత ఎస్.ఎస్. వాసన్ ఆమెను చూడగానే ఆ పాత్రకు ఎంపిక చేసేశారు. 'ముగ్గురు కొడుకులు' షూటింగ్ మొదలైంది. సరైన తిండీతిప్పలు లేకపోయినా, ఒకవైపు ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకుంటూ రోజూ షూటింగ్‌కు హాజరవుతూ వచ్చారు జానకి. అయితే ఒకరోజు నీరసానికి తట్టుకోలేక సెట్లోనే స్పృహతప్పి పడిపోయారు. అందరూ కంగారుపడి, డాక్టర్‌ను పిలిపించి, ప్రథమ చికిత్స చేశారు. తర్వాత వాసన్ అడిగినప్పుడు తన పరిస్థితి ఉన్నదున్నట్లు చెప్పారు జానకి. ఆయన ఎంతో సానుభూతి వ్యక్తంచేశారు. అంతేకాదు, ఆమెకు ఆ చిత్రం ద్వారా లభించే పారితోషికం అంతా ఒకేసారి ఇవ్వమని చెప్పారు. ఆమెనొక నర్సింగ్ హోమ్‌లో చేర్పించి, వారం రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకొని, కోలుకున్న తర్వాత షూటింగ్ కొనసాగించమన్నారు. ఆ సినిమాలో ఆమె మహానటి కన్నాంబకు కోడలుగా నటించారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
